మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ క్యాంప్ కార్యాలయంపై శనివారం డ్రోన్ ఎగిరింది. ఈ మేరకు పార్టీ నాయకులు డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. స్పందించిన ఉన్నతాధికారులు అసలు ఏం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. శాంతిభద్రతల అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్ సీఐ వినోద్ తదితరులు జనసేన కార్యాలయానికి చేరుకుని సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. మధ్యాహ్నం డ్రోన్ చాలా ఎత్తులో ఎగురుతూ కనిపించిందని, ఫొటో తీయటానికి వీలుపడలేదని ఒకరు చెప్పినట్లు తెలిసింది. డ్రోన్‌ను తొలుత చూసిందెవరు? అది ఎంత ఎత్తులో ఎగిరింది? ఏ వైపు నుంచి వచ్చింది? ఎటు వైపు వెళ్లిందనే వివరాలను పార్టీ కార్యాలయ సిబ్బందితో పాటు ఆ పరిసరాల్లోని నివాసాలు, దుకాణాల వారిని అడిగి నమోదు చేసుకున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. అది డ్రోనా.. కాదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదన్నాయి.

Post A Comment:
0 comments: