కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నా
పిఠాపురం నుంచే కొత్త ప్రయాణం.. రాష్ట్రమంతటా పర్యటిస్తా
పల్లె పండుగ- గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు నెలల హనీమూన్ కాలం అందరికీ అయిపోయిందని, ఇక ఒళ్లు వంచి పని చేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన కొత్త ప్రయాణం పిఠాపురం నుంచి మొదలుపెడతానని ప్రకటించారు. నెలలో రెండు వారాలు ఇక్కడే ఉంటానన్నారు. ప్రతి గ్రామం తిరుగుతానని, ఒళ్లు వంచి పనిచేస్తానని, ఆ తర్వాతే ఓట్లడుగుతానని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలన పూర్తయ్యాక ఇంకోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వొచ్చని అనిపిస్తే ఇవ్వండి.. లేదంటే వదిలేయండి అని వ్యాఖ్యానించారు. ఇకపై రాష్ట్రమంతా తిరుగుతానని, ప్రతి జిల్లా కేంద్రంలోనూ పర్యటిస్తానని చెప్పారు. పిఠాపురం శక్తిపీఠంపై ఆన వేసి మనస్ఫూర్తిగా చెబుతున్నానని.. 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కుమారపురంలో ఆయన ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించారు.
మేమొచ్చాక 12,500 గోకులాలు
‘ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే, మేం ఆరు నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాం. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలనేదే గోకులాల పథకం ఉద్దేశం. వైకాపా ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే.. కూటమి ప్రభుత్వం పల్లె పండుగ, గోకులాలు, పింఛన్ల పెంపు, సకాలంలో జీతాలివ్వడం.. అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తోంది. సహకార డెయిరీలను వైకాపా ప్రభుత్వం చంపేసింది. రాష్ట్రంలో డెయిరీ కోఆపరేటివ్ సొసైటీలు 10 శాతం మాత్రమే ఉన్నాయి. వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న 97 లక్షల మందికి రూ.5,193 కోట్లు చెల్లించాం. రూ.2 కోట్లు మాత్రమే బకాయిలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించాం. రూ.4,500 కోట్ల విలువ గల పనులకు అనుమతి తీసుకుని, 22,500 గోకులాలు, 3,500 కి.మీ సీసీ రోడ్లు మంజూరు చేశాం. చిన్న, సన్నకారు రైతులకు చెందిన 43,385 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపడతాం. సగటు కూలి రేటు మెరుగుపరిచి, నకిలీ మస్తర్లు లేకుండా చేయడానికి వేతన పర్యవేక్షణ కమిటీ వేశాం’ అని చెప్పారు.
ఆడపిల్లలను వేధిస్తే తొక్కి నార తీస్తా..
నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లలను ఏడిపించినా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తొక్కి నార తీస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్, దొంగతనాలు, గంజాయి విక్రయాలపై ఫిర్యాదులు వస్తున్నాయని.. కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. అందరికీ సమన్యాయం జరగకపోతే.. మళ్లీ నాలాంటోళ్లు వచ్చి రోడ్డెక్కి పోరాడాల్సి వస్తుందన్నారు. నా నియోజకవర్గాన్నే నేను సరిగ్గా కాపాడుకోలేనప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, అధికారులు దేనికి అని వ్యాఖ్యానించారు. ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు తాను వస్తే సినిమా పేర్లు, కేరింతలు వద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
‘తిరుపతిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, 39 మంది గాయపడడంతో నా మనసు క్షోభించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ మీకు క్షమాపణ చెప్పాను. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఎన్డీయేకు ఓట్లేశారు. చంద్రబాబు, నేను, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోతే తితిదే బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? ఛైర్మన్, ఈవో, ఏఈవో, సభ్యులు ఎలా నియమితులవుతారు? మూడు తరాల ముందు జరిగిన తప్పునకు జపాన్ ప్రధాని పార్లమెంటులో క్షమాపణ చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది అదే. నేను క్షమాపణ చెప్పినప్పుడు మీకు చెప్పడానికి నామోషీ ఏంటి? మా తప్పు కాదంటే ఎట్లా? మీరు వచ్చి ఒక్కొక్కరి కథ వింటే ఆ బాధ అర్థమవుతుంది. తితిదే బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్యచౌదరి క్షమాపణ చెప్పాలి’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పీఆర్-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్ కృష్ణతేజ, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, టిడ్కో ఛైర్మన్ అజయ్‌కుమార్, కుడా ఛైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, తెదేపా, భాజపా, జనసేన ఇన్‌ఛార్జ్జులు వర్మ, బుర్రా కృష్ణంరాజు, మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.


Post A Comment:
0 comments: