ఆవు బాగుంటే రైతు బాగుంటాడని.. రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో 268 గోకులం షెడ్లు నిర్మిస్తే.. ఆరు నెలల్లో తాము 12,500 నిర్మించామని చెప్పారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్‌ మాట్లాడారు.


‘‘గోకులాల ద్వారా చిన్న, కౌలు రైతులు, ఇతర వర్గాలు బాగుపడతాయి. భవిష్యత్తులో 20వేల గోకులాలు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసింది. స్కామ్‌ల్లో రికార్డు సృష్టించింది. మా ప్రభుత్వం పల్లె పండుగ, గోకులాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. సకాలంలో జీతాలు, పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. శ్రమ ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి. రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా ఆలోచనలు చేస్తున్నాం. ఎన్డీయే, చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మీరంతా ఓట్లు వేశారు. ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలి. తప్పు జరిగితే అది మా అందరి సమష్టి బాధ్యత. అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించాను... మనస్ఫూర్తిగా క్షమాపణ కోరా.


ఎలా స్పందించాలో తెలియాలి..

ఎక్కడ ఎలా స్పందించాలో అభిమానులకు తెలియాలి. ప్రమాద సమయాల్లో కేరింతలు అనవసరం. కేరింతలు.. అరుపులు కాదు.. పోలీసులకు సహకరించాలి. తిరుపతి ఘటన చూశాం.. ఎవరి బాధ్యత వాళ్లు సరిగా చేస్తే సరిపోయేది. కొంతమంది చేసిన తప్పునకు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఉద్యోగి, అధికారి.. ఎవరైనా వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించాలి. గత ప్రభుత్వంలో అలవాటుపడి కొంతమంది పనిచేయడం మానేశారు. న్యాయం అందరికీ జరిగేలా చూడటం ముఖ్యం. తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలని అసెంబ్లీలో చెప్పా. రాజ్యాంగం ఇచ్చిన విధులను సంపూర్ణంగా పరిరక్షించాలని మనస్ఫూర్తిగా అధికారులను కోరుతున్నా. చాలా పెద్ద మనసుతో.. గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చా.


తితిదే ఛైర్మన్, సభ్యులు క్షమాపణ చెప్పాలి

నాకు అధికారం అలంకారం కాదు.. బాధ్యత. ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తా. చేయని తప్పునకు జపాన్‌ ప్రధాని క్షమాపణ చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్, సభ్యులు ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణలు చెప్పాలి. నేను క్షమాపణ చెప్పినప్పుడు.. మీరు చెప్పడానికి ఏంటి నామోషీ?మీ తప్పు లేదంటే ఎలా?నేను మాత్రం దోషిగా నిలబడాలా? వీఐపీ ట్రీట్‌మెంట్‌ తగ్గి.. కామన్‌ మ్యాన్‌ ట్రీట్‌మెంట్‌ పెరగాలి.


విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటుంది

నాతో సహా అందరికీ 6 నెలల పాలన పూర్తయింది. మీరు నన్ను నమ్మి గెలిపించారు.. నిలబెట్టి పనిచేయిస్తాను. ఒళ్లు వంచి పని చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను. 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ఉండాలని కోరుకుంటున్నా. అధికార యంత్రాంగం సహకారం కావాలి. పిఠాపురం నుంచి జిల్లాల పర్యటన మొదలుపెడుతా. బాధ్యతగా ఉంటాను.. నాయకులను కలుపుకొని వెళ్తాను. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటుంది. నాకు డబ్బు, పేరు మీద ఇష్టం లేదు. బాధ్యత మాత్రమే ఉంది. నాకు దేవుడు అవసరమైనంత డబ్బు, పేరు ఇచ్చాడు. ప్రజలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పవన్‌ అన్నారు. 

Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: