ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు అంగీకరించిన సినిమాల్లోను నటిస్తున్నారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అయితే, ఆయన సినీరంగంలో కొనసాగుతారా? వరుస సినిమాలు చేస్తారా? అని అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి మాట్లాడారు. డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటానన్నారు.
‘‘నేను ఎంతోమంది యోగులు, సిద్ధులను చూసి స్ఫూర్తి పొందుతుంటాను. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఎప్పుడూ ఇదే ఆలోచనలో ఉంటాను. నేను సంపద కూడబెట్టుకోలేదు. సినిమా నిర్మాణరంగంలోనూ భాగం కాను. ఎలాంటి వ్యాపారాలు లేవు. నాకు ఉన్న ఆదాయమార్గం నటనే. నేను సినిమాలు చేస్తున్నంతవరకూ వాటికి న్యాయం చేయాలి. అలాగే నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను. అయితే, పరిపాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా నటిస్తాను’’ అని పవన్ క్లారిటీ ఇచ్చారు.

Post A Comment:
0 comments: