ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి, చేయిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని రాజధాని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి పనుల్ని ప్రధాని మోదీ మే 2న పునఃప్రారంభించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం రాజధాని రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజధాని రైతులంతా కుటుంబసభ్యులతో రావాలని సీఎం ఆహ్వానించారు.
ఆ సందర్భంగా రాజధాని రైతులు తమ ఆకాంక్షల్ని ఆయన ముందుంచారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చేయాలని రైతులు కోరారు. ఎన్డీయేలో తెదేపా కీలక భాగస్వామిగా ఉన్నందున చంద్రబాబు చెబితే ప్రధాని మోదీ వింటారని వారు పేర్కొన్నారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ... ‘అది మన పరిధిలోని అంశం కాదు. మనం డిమాండ్ చేయకూడదు. సామరస్యంగా అన్నీ సాధించుకుందాం’ అని పేర్కొన్నారు. మే రెండో తేదీ రాష్ట్ర చరిత్రలో మైలురాయి కాబోతోందని.. రాజధాని నిర్మాణంలో ఇదో కీలక ముందడుగు అవుతుందని ఆయన తెలిపారు. రైతుల త్యాగం వల్లే అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకుంటున్నామని.. వారి మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ఆయన ముచ్చటించి... వారి సందేహాలు నివృత్తి చేశారు. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను సత్వరం పరిష్కరిస్తామని, రుణాలిప్పించేలా బ్యాంకులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. రాజధానివాసులకు అండగా ఉండేందుకు, భరోసా కల్పించేందుకే తానూ అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రితో తమ చర్చల సారాంశాన్ని అనంతరం రాజధాని రైతులు విలేకర్లకు వెల్లడించారు.

Post A Comment:
0 comments: