వైసీపీ ప్రభుత్వ హయాంలో తెదేపా సానుభూతిపరులు, మద్దతుదారులపై రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్‌పై అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే, వైకాపా నాయకురాలు విడదల రజిని.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేత దాడులు చేయించినట్లు వెల్లడైంది. క్రషర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వటమే కాకుండా.. భారీగా జరిమానా విధించేందుకు వీలుగా తప్పుడు నివేదిక సమర్పించేలా.. క్షేత్రస్థాయి విచారణకు వెళ్లిన అధికారులు, సిబ్బంది, సర్వే జరిపిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్లు నిర్ధారణైంది. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి, వేధించి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణలో భాగంగా గుంటూరు నాటి ఆర్‌వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నోటీసులిచ్చింది. గతేడాది అక్టోబరు 21న ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆ వాంగ్మూలం తాజాగా వెలుగుచూసింది. ఈ దాడులను రజిని చేయించినట్లు అందులో తేలింది.
2019 జూన్ 24 నుంచి 2021 ఆగస్టు 24 వరకూ గుంటూరు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి(ఆర్‌వీఈవో)గా పనిచేశా. అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మా కార్యాలయానికి వచ్చి, యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్‌పై లిఖితపూర్వక ఫిర్యాదిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తోందని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఆరోపణలపై ప్రాథమికంగా రహస్య విచారణ చేయించా.
స్టోన్ క్రషర్ యజమానులు నాటి ప్రతిపక్ష తెదేపా సానుభూతిపరులని, విడదల రజిని అప్పటి అధికార వైకాపా ఎమ్మెల్యే కావటంతో వారి మధ్య తీవ్ర రాజకీయ శత్రుత్వం కొనసాగుతోందని తేలింది. క్రషర్ యజమానుల్లో ఒకరైన కట్టా శ్రీనివాస్ చిలకలూరిపేటలోని కూడలిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. విడదల రజిని, అనుచరులు అభ్యంతరం వ్యక్తంచేసి అడ్డుకున్నారు. తర్వాత కట్టా శ్రీనివాస్ తన నివాస ప్రాంగణంలోనే విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం, రజిని మధ్య రాజకీయ శత్రుత్వం ఏర్పడినట్లు విచారణలో గుర్తించా. ఈ పరిణామాలు, విభేదాల నేపథ్యంలోనే ఫిర్యాదు అందింది.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలోని సహజ వనరుల విభాగానికి అసిస్టెంట్ జియోలజిస్ట్ ఎన్.ప్రసాద్ నాయకత్వం వహించేవారు. విడదల రజిని ఫిర్యాదుపై విచారణ జరపటానికి ఆ విభాగంలో తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో జిల్లా భూ సర్వేయర్‌తో కలిసి సంయుక్త క్షేత్ర విచారణ జరిపించాలని కోరుతూ గుంటూరు జిల్లా గనుల శాఖ ఏడీకి లేఖ రాశా. వారు ఓ ప్రైవేటు సంస్థతో థర్డ్ పార్టీ విచారణ చేయించి స్టోన్ క్రషర్ రూ.10.5 కోట్లు మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు నివేదికిచ్చారు.
ప్రాథమికంగా ఆ నివేదిక పరిశీలిస్తే అందులో వారు పేర్కొన్న ఎగవేత అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఏ మాత్రమూ హేతుబద్ధత లేదు. రోడ్డు మెటల్ మైనింగ్ కేసుల్లో అంత భారీ మొత్తం ఎగవేత సాధ్యం కాదు. రూ.10.5 కోట్ల మేర మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు అసలు వారు ఏ ప్రాతిపదికన లెక్కకట్టారు? దానికి వారు అనుసరించిన విధానమేంటి? అనేది తనిఖీ చేయాలని అసిస్టెంట్ జియోలజిస్ట్ ఎన్.ప్రసాద్‌ను ఆదేశించా. క్షేత్రస్థాయి సర్వే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందా? లేదా? అనేదానిపై నేనూ రహస్యంగా విచారించా.
స్టోన్ క్రషర్ భారీగా మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు అంచనాలు పెంచి నివేదికివ్వాలంటూ ఆ విచారణలో పాల్గొన్న అధికారులు, సర్వే చేసిన థర్డ్‌పార్టీ ఏజెన్సీపై తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో రాజకీయ ఒత్తిళ్ల మధ్య, పక్షపాత ధోరణితో సర్వే నిర్వహించినట్లు నా విచారణలో తేలింది.
.jpeg)
Post A Comment:
0 comments: