‘నేను 2024 జనవరిలో వైసీపీకు రాజీనామా చేసి బయటికొచ్చా. ఆరోజు నుంచి ఇప్పటి వరకూ ఏ వ్యక్తి గురించీ తప్పుగా ఎవరి దగ్గరా మాట్లాడలేదు. ఇప్పుడు విడదల రజిని వెనుక ఉండి మాట్లాడిస్తున్న వారికి ఒక్కటే చెబుతున్నా. ఇప్పటి వరకూ సంయమనంతో వ్యవహరించాను. ఇక నుంచి అలా ఉండను. అవకాశం వచ్చిన ప్రతి వేదికపైనా మాట్లాడతాను. ఈ విషయమే కాదు చాలా విషయాల్లో పేర్లతో సహా నిజాలన్నీ బయటపెడతా. ఈ వ్యవహారం మీరే మొదలుపెట్టారు. ఇప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను. అది ఎంత దూరం వెళ్తుందో చూసుకుందాం’ అని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపా నేతలను హెచ్చరించారు.
సోమవారం దిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్టోన్‌క్రషర్స్ యజమానుల ద్వారా తానే ఫిర్యాదు చేయించినట్లు, తాను విశాఖపట్నం భూములు కాజేసినట్లు మాజీ మంత్రి విడదల రజిని చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
మేం ఏ ప్రభుత్వం నుంచీ భూములు తీసుకోలేదు
‘నేను కాల్‌డేటా తీయించినట్లు రజిని ఆరోపించారు. మా ఇంట్లో కూడా తోబుట్టువులు ఉన్నారు. నేను మా ఇంట్లో మహిళలకు ఒక న్యాయం, బయటి మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని కాదు. విశాఖపట్నంలో మాకు భూములున్నట్లు రజిని మరో ఆరోపణ చేశారు. మేం 1977 నుంచి విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నాం. ఈ 45 ఏళ్లలో మాకు భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలో ఎక్కడా దరఖాస్తు పెట్టిన దాఖలా లేదు. ఎవరి దగ్గరైనా ఉంటే ఆ వివరాలు మీడియాకు చూపించవచ్చు.
విశాఖపట్నంలో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వేలం వేస్తే పోటీపడి గరిష్ఠ ధరకు కొనుక్కున్నాం. రజిని.. వేలానికి, కేటాయింపులకు తేడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ రెండు విషయాలపై ఆమె ఎందుకు మాట్లాడారో, ఎవరు మాట్లాడించారో నాకు తెలుసు. ఫోన్ డేటా పేరిట నా వ్యక్తిత్వ హనానికి పాల్పడేందుకు ఎత్తులు వేశారు. మా భూముల గురించి ప్రస్తావించి ఆమె అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు.
రజిని స్వహస్తాలతో ఫిర్యాదు
లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్స్‌లో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, దానిపై జరిమానా విధించమని 2021 ఆగస్టు 24న విడుదల రజిని స్వహస్తాలతో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా చర్యలు తీసుకోకపోతే రాజకీయ పెద్దల ఆఫీసులకు వెళ్లి ఆయనకు ఫోన్లు చేయించారు. మాధవరెడ్డి అనే సాక్షి విలేకరిని వెంటబెట్టుకుని అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరకు వెళ్లి.. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీగా మీరెందుకు చర్యలు తీసుకోలేదని జాషువాను అడిగించారు. ఆ తర్వాత రజిని ఆ స్టోన్‌క్రషర్స్‌పై అధికారులతో భారీ జరిమానా రాయించారు. యజమానులను తన దగ్గరకు రప్పించుకొని ఆ జరిమానా అయినా చెల్లించు.. లేదంటే నాకు కప్పం కట్టు అని బెదిరించి రూ.2.5 కోట్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి జాషువా దర్యాప్తు అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చెప్పారు.
దీనిపై స్టోన్‌క్రషర్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజినిపై కేసు పెట్టారు. వైకాపాకు చెందిన పోతారం బాషా, ఎంపీపీ శంకర్‌రావు, జడ్పీటీసీ ముక్తా వాసు, వైస్‌ఛైర్మన్ గోల్డ్ శీను, మున్నంగి రత్తారెడ్డి, అబ్బాస్ ఖాన్, సత్తా వేములయ్య, నాగయ్య, రాజేష్ నాయుడు, గట్టా హేమ, ప్రదీప్‌ల దగ్గర నుంచి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొన్నారు. తిరిగిమ్మని అడిగితే వారందర్నీ బెదిరించారు. ఇళ్ల స్థలాల కోసం భూములిచ్చిన పసుమర్తి రైతులకు ప్రభుత్వం చెల్లించిన సొమ్ములో పర్సంటేజీ తీసుకున్నారు. దానిపై నేను గట్టిగా మాట్లాడటంతో డబ్బులు వెనక్కిచ్చారు’ అని ధ్వజమెత్తారు.
తప్పు మీద తప్పు చేస్తున్నారు..
‘స్టోన్‌క్రషర్స్ నుంచి మీరు నిజంగా డబ్బులు తీసుకోకపోయి ఉంటే.. గుంటూరులో దుర్గారావు అనే కౌన్సిలర్ దగ్గర మేం ఈ డబ్బు పెడతాం.. వాటిని తీసుకొని ఈ కేసు ఉపసంహరించుకోండి అని పదిరోజుల క్రితం నా దగ్గరకు మధ్యవర్తిని ఎందుకు పంపించారు? తప్పుమీద తప్పు చేస్తున్న మీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మాపై ఆరోపణలు చేస్తారా?’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు విడదల రజినిని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీలు అప్పలనాయుడు, నాగరాజు పాల్గొన్నారు.
.jpeg)
Post A Comment:
0 comments: